వైవిధ్యమైన పాత్రలలో నటించిన నటశేఖరుడు.... 
తెలుగు చిత్రరంగానికి కొత్త రంగులు అద్దిన చిత్రశేఖరుడు.... 
తెలుగు చిత్రసీమకే రాజశేఖరుడు.... 
డెబ్బై ఎనిమిది వసంతాల బాలుడు ఈ బుర్రిపాలెం బుల్లోడు.... 
సాహసాలకు పెట్టింది పేరు... 
తను అనుకున్నది సాధించేవరకు వదిలిపెట్టని ధీరుడు... 
నటశేఖరుడు, ఆంధ్ర జేమ్స్‌బాండ్, సూపర్‌స్టార్ బిరుదులతో పాటు డాక్టరేట్ వచ్చినా ఆయన హీరో కృష్ణగానే ప్రసిద్దుడు... 
సినిమా ప్రపంచంలో ఎవరినైనా ఫలానా అని ఇంటిపేరుతోగాని, అసలు పేరుతోగాని పిలుస్తారు. ఆయనకు మాత్రం హీరో అనేది ఇంటిపేరయ్యింది.... 
ఆయనే ఘట్టమనేని శివరామకృష్ణ......
ఆయన జీవితచరిత్రకు ఇదో అక్షరరూపం..... 
కాలం కలిసి వచ్చిన వాడికి తొందరగా విజయం వస్తుంది…. 
కష్టపడే వాడికి ఆలస్యంగా విజయం వస్తుంది..... 
ఎందుకంటే.... 
గేదకి గడ్డి దొరికినంత తేలికగా….   సింహానికి జింక దొరకదు..... 
ప్రతీ మనిషికీ జీవితంలోను మిట్టపల్లాలుంటాయి, సుఖదుఃఖాలుంటాయి. ఆయన జీవితంలోనూ వున్నాయి... 
కష్టపడి వాటిని సాహసంగా ఎదుర్కొని దానినే తనకు మారుపేరుగా మార్చుకున్నారు... 
కృష్ణకు మారుపేరు సాహసం అని అనిపించుకుని నటశిఖరాలని అధిరోహించి నటశేఖరుడుగా, సూపర్‌స్టార్‌గా, నిర్మాతగా, దర్శకుడుగా, ఎడిటర్‌గా, స్టూడియో అధినేతగా, రాజకీయవేత్తగా జీవితంలో ఎన్నో పాత్రలను పోషించడమేకాకుండా, సినిమాస్కోప్ లాంటి ఎన్నో కొత్త సాంకేతికతలను తెలుగు సినిమా రంగుల ప్రపంచానికి పరిచయం చేశారు... 
ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించారు, తెలుగు, హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. 360 సినిమాలలో నటించారు (హీరోగా 340సినిమాలు). ఒక నటుడిగా తన పని తాను చేసుకుని వెళ్ళిపోకుండా సినిమా మొదలు నుండి తుది వరకు నిర్మాతకు అండగావుండే ధర్మశీలి... 
అటువంటి మహామనిషి జన్మదినము... 
అభిమానులకు మరుపురాని పండగదినము.....  31 మే...... 
1943 మే 31 న గుంటూరు జిల్లా, తెనాలి మండలములో తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామస్తులైన ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా నటశేఖరుడు జన్మించారు..... 
ఆయనది రైతు కుటుంబం తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు ఈ పేరును కృష్ణగా కుదించారు...... 
చిన్నతనం నుంచి ఆయనకు ఎన్.టి. రామారావు అభిమాన నటులు, పాతాళ భైరవి అభిమాన చిత్రం….. 
కృష్ణ తల్లిదండ్రులకు కృష్ణను ఇంజనీరును చేయాలన్న కోరిక ఉండేది. అందుకోసం ఇంటర్మీడియట్‌లో ఎం.పి.సి. సీటు కోసం ప్రయత్నించి, గుంటూరు కళాశాలలో దొరకకపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎం.పి.సి. గ్రూపులో ఇంటర్ చేరారు. అక్కడ మూడు నెలలే చదివి, ఏలూరులోని సి.ఆర్.రెడ్డి కళాశాలకు మారారు. అక్కడే ఇంటర్మీడియట్ పూర్తిచేసి తర్వాత బీఎస్సీ చదివారు... 
సి.ఆర్.రెడ్డి కళాశాలలో కృష్ణ….  తర్వాతి కాలంలో సినిమాల్లో నటునిగా ఎదిగిన మురళీమోహన్ క్లాస్‌మేట్లు, మంచి స్నేహితులు. కృష్ణ డిగ్రీ చదువుతూండగా ఏలూరులో ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన కృష్ణకు నాగేశ్వరరావు నటుడు కావడం వల్లనే ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందగలుగుతున్నారని అర్థం చేసుకుని సినీ నటుడు కావాలన్న అభిలాష పెంపొందించుకున్నారు..... 
డిగ్రీ పూర్తిచేశాకా ఇంజనీరింగ్ కోసం ప్రయత్నించినా కృష్ణకు సీటు రాలేదు. దాంతో కృష్ణ విద్యార్థి జీవితం ముగిసింది... 
కృష్ణకు హీరోగా తొలి సినిమా తేనె మనసులు ప్రారంభమయ్యేనాటికే ఇందిరతో వివాహం అయింది. 1965 నాటికే పెద్ద కొడుకు రమేష్ బాబు పుట్టారు. కృష్ణ, ఇందిరలకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.... రమేష్ బాబు, పద్మజ, మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శిని..... 
కృష్ణ 1970లు, 1980ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందారు... 
1964కు ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన కృష్ణకు 1964-65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనెమనసులు, మూడవ సినిమా గూఢచారి 116 పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ఉపకరించాయి... 
ఆపైన నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించారు... 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశారు. 1983లో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పారు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశారు. 
సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు సినిమాలు తెలుగు చిత్రసీమలో కొత్త సాంకేతికతలు పరిచయం చేసి టాలీవుడ్ కి దిక్సూచిగా నిలిచాయి. 
తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ సినిమా (గూఢచారి 116)..... 
తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్ళకు మోసగాడు)..... 
తొలి ఫుల్‌స్కోప్ సినిమా (అల్లూరి సీతారామరాజు)... 
తొలి 70 ఎంఎం సినిమా (సింహాసనం) వంటివి కృష్ణ నటించిన సినిమాలే. వీటితో పాటుగా పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడిపంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ప్రధానంగా 1976-1985 మధ్యకాలంలో కృష్ణ కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 
1964 నుంచి 1995 వరకు కృష్ణ సగటున పదేళ్ళకు వంద సినిమాలు, అంటే ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేశారు. ఇందుకోసం మూడు షిఫ్టులు చొప్పున వేగంగా సినిమాలు పూర్తిచేసారు.... 
ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం, ప్రజాదరణ చూసి సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్న కృష్ణ అత్యంత వేగంగా తాను ఆశించిన ప్రజాదరణ సాధించారు. కృష్ణకు రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఆనాడు ఉండేవి. ఆయన అత్యున్నత దశలో ఉండగా ఒక సినిమా శతదినోత్సవానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మద్రాసుకు 30 వేల మంది అభిమానులు స్వచ్ఛందంగా బస్సుల్లో తరలివెళ్ళారు. ఆయనకి ఫిల్మ్‌ఫేర్ సౌత్ జీవిత సాఫల్య పురస్కారం (1997),  ఎన్టీఆర్ జాతీయ పురస్కారం (2003), ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (2008), పద్మభూషణ్ పురస్కారం (2009) లభించాయి. 
1984 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా వ్యవహరించిన కృష్ణ  1989లో ఏలూరు నియోజకవర్గం నుంచి లోక్‌సభ సభ్యునిగా గెలుపొంది భారత పార్లమెంటులోకి అడుగు పెట్టారు.... 
అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి పాత్రలో చేసిన నటనకు 1974లో ఉత్తమ నటునిగా నంది పురస్కారం కృష్ణ అందుకున్నారు... ఆయన సినీజీవితంలో కమర్షియల్ విజయాలు మాత్రం లెక్కకు మిక్కిలి.... 
అంతేకాక తెలుగు సినిమా రంగంలో పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, పలు విభిన్నమైన ప్రయోగాలు చేయడం వంటివి తెలుగు చలన చిత్ర రంగంలో కృష్ణ స్థానాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.... 
ఆయనకు మరో అరుదైన గౌరవం ఏంటంటే..... ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది.... 
1976లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కె.వి.రఘునాథరెడ్డి చేతుల మీదుగా కృష్ణ "నటశేఖర" బిరుదును అందుకున్నారు... 
నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ వ్యక్తిగతంగా మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నారు.... క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడేవారు... 
1972లో ఆంధ్రప్రదేశ్‌లో కరువుతో అల్లాడుతున్న ప్రజలకు ఊరట కలిగించేలా సాయాన్ని అందించేందుకు కృష్ణ విరాళాల సేకరణ కార్యక్రమాలు రూపొందించారు... 
కరువు బాధితుల సహాయ నిధికి సినిమా తారల యాత్ర పేరుతో 1972 అక్టోబరు 28 నుంచి నవంబరు 2 వరకు విజయవాడ, తెనాలి, గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్‌లలో తోటి నటీనటులు, సాంకేతిక నిపుణులను కూడగట్టి కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన డబ్బును సహాయ నిధికి అందించారు.... 
సినీ జీవితంలోనే కాకుండా... 
నిజ జీవితంలోను తన వ్యక్తిత్వంతో    హీరో అనిపించుకున్న డెబ్బై వసంతాల బాలుడు ఈ బుర్రిపాలెం బుల్లోడి మరిన్ని జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా జరుపుకోవాలి.... 
  మీ భవదీయుడు.....
వై వి సుబ్రమణ్యం, మచిలీపట్టణం.




























